అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా తనను నియమించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ ను కలిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎత్తుకు జగన్ ప్రభుత్వం పైయెత్తు వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ ను కలిసి హైకోర్టు ఆదేశాలపై వినతిపత్రం సమర్పించారు. 

తనను ఎస్ఈసీగా తిరిగి నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై హైకోర్టు స్పందిస్తూ తమ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల అమలు కోసం గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించింది. దీంతో రమేష్ కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ ను కలిశారు. హైకోర్టు ఆదేశాలపై గవర్నర్ కు విన్నవించారు. 

ఈ స్థితిలో నిమ్మగడ్డ ప్రయత్నాలకు జగన్ ప్రభుత్వం విరుగుడు కనిపెట్టింది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అశ్రయించింది.  హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‍లో అభిప్రాయపడింది.