కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలు: సుప్రీంలో ఎస్ఎల్‌పీ దాఖలుకు జగన్ సర్కార్ నిర్ణయం
కృష్ణాజలాల పంపిణీపై కేంద్రం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలపై ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
అమరావతి: కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్రం జారీ చేసిన విధి విధానాలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన తాజా విధివిధానాలపై సోమవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. కృష్ణా నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. తీర్పుద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా చర్చ జరిగింది.
ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దంగా మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని అధికారులు చెప్పారు. సెక్షన్ 89 లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెబుతున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధనలను ఉల్లంఘించేలా మార్గదర్శకాలున్నాయని అధికారులు సీఎం కు వివరించారు.
ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉన్న సమయంలో కూడా గెజిట్ విడుదల చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలో క్లాస్ నుకూడా ఉల్లంఘించారని అధికారులు అభిప్రాయపడ్డారు. 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు జారీ చేసిందని అధికారులు సీఎంకు తెలిపారు.
also read:తెలంగాణకు బీజేపీ ఎన్నికల తాయిలాలు:కేంద్ర కేబినెట్‌లో మూడు కీలకాంశాలకు గ్రీన్ సిగ్నల్
గోదావరి నదీజలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటును అధికారులు ప్రస్తావించారు. పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదన్నారు అధికారులు.రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ పడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా జలాల మార్గదర్శకాలపై గెజిట్ వెలువడిన నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలనికూడా సీఎం అధికారులకు సూచించారు.