అమరావతి: ఆస్తుల బదిలీ (దస్తావేజుల రిజిస్ట్రేషన్‌) కోసం వసూలు చేసే స్టాంపు సుంకాన్ని (డ్యూటీ) పెంచాలని ముఖ్యమత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో సుమారు 25 నుంచి 30 రకాల స్టాంపు డ్యూటీలు అమల్లో ఉన్నాయి. దస్తావేజులోని ఆస్తి విలువ,   రకాన్ని బట్టి 1% నుంచి 5% వరకు ప్రభుత్వం సుంకం వసూలు చేస్తోంది. 

ఇకపై వీటిని రెండు స్లాబుల (5%, 2%) కింద వర్గీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో   అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేస్తున్నారు. వీటిపై అధికారిక నిర్ణయం   వెలువడితే ప్రజలపై ఏటా రూ.250 కోట్ల వరకు ఆర్థిక భారం పడనుంది.

పార్టీషన్‌ కేటగిరీలో (పారిఖత్తు దస్తావేజు) రూ.10 లక్షల విలువైన రెండెకరాలను నలుగురు కుటుంబీకులు సమంగా పంచుకున్నట్లయితే.. రూ.2.5 లక్షలకు స్టాంపు డ్యూటీ ఉండదు. మిగిలిన రూ.7.5 లక్షలపై ఒక శాతం కింద రూ.7,500 చెల్లించాలి. ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రకారం ఒక శాతాన్ని 2 శాతానికి పెంచినట్లయితే ఇది రూ.15వేలవుతుంది. సెటిల్‌మెంట్‌ కేటగిరీలో (దఖలు) ఓ వ్యక్తి.. తన భార్య, కుమారుడు, కుమార్తెకు రూ.20 లక్షల ఆస్తిని ఇవ్వాలంటే రూ.40వేలను (2%) ప్రస్తుతం స్టాంపు డ్యూటీ కింద చెల్లిస్తున్నారు. 

ప్రస్తుతం 5శాతానికి పెంచాలని ప్రతిపాదించడం ద్వారా మరో రూ.60వేలు అదనంగా భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో సబ్‌రిజిస్ట్రార్లలో   పలువురు తమకున్న అధికారాలను అనుసరించి ‘ఉద్దేశపూర్వకంగా’ సుంకాన్ని పెంచడం,  తగ్గించడం చేస్తున్నారు. దీనిలో పారదర్శకత కోసం 2 స్లాబుల విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆడిటింగ్‌, ఇతర విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. అలాగే పలు స్టాంపు సుంకాలను తగ్గించే విషయాన్నీ (లీజు, ఇతర) అధికారులు పరిశీలిస్తున్నారు.

నివాస భవనాలు ఏడాదిలోపు కాలవ్యవధికి లీజు తీసుకుంటే ప్రస్తుతం 0.4%, ఐదేళ్లలోపు అయితే 0.5% స్టాంపు డ్యూటీ విధిస్తున్నారు. దీన్ని 2 శాతానికి పెంచేలా ప్రతిపాదనలున్నాయి. వాణిజ్య భవనాలకు ఏడాదిలోపు లీజు తీసుకుంటే  0.4 %, అయిదేళ్లలోపు అయితే 1% విధిస్తున్నారు. వీటినీ 2శాతానికి పెంచడానికి ప్రతిపాదిస్తున్నారు.