Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ప్రణాళిక.. నేతలకు కీలక సూచనలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో విజయం సాధించాలని అధికార వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది.

YS jagan Focus to win all seven MLC seats under MLA quota
Author
First Published Mar 22, 2023, 10:20 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో విజయం సాధించాలని అధికార వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకులు.. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో.. ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలో వైసీపీ విజయం సాధిస్తూ వచ్చింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయయాత్ర కొనసాగించింది. అయితే ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం స్థానాలను సొంతం చేసుకుని తమ సత్తా చాటాలని భావిస్తోంది.

అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలుపడటంతో ఎన్నిక అనివార్యం అయింది.  అసెంబ్లీలో బలాల (సాంకేతికంగా)  ప్రకారం.. వైఎస్సార్‌సీపీకి 151 మంది ప్రజాప్రతినిధులు, టీడీపీకి 23 మంది, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగనుందన్న.. వాస్తవ సంఖ్యలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నలుగురు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. టీడీపీ నుంచి విజయం సాధించి వైసీపీకి మద్దతు తెలిపిన.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌లు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైపే ఓటు వేస్తారనే భావిస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి విధేయతతో ఉన్నారు. దీంతో టీడీపీ బలం 19కే పరిమితమైంది. అయితే ప్రస్తుతం వైసీపీ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు(ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి) ఉన్నారు. వారు ప్రస్తుతం వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని ప్రచారం సాగుతుంది. దీంతో ఆ రెండు ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది.

వైసీపీకి సొంతంగా  151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జనసేన ఒక ఎమ్మెల్యే, టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఆ పార్టీ మొత్తం బలం 156గా ఉంది. అయితే అందులో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేను తీసేసిన ఆ పార్టీకి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా అవుతుంది. అయితే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందాలంటే 22 నుంచి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కను పరిగణలోకి తీసుకుంటే.. వైసీపీ ఏడు స్థానాలకు గెలుచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఓట్లలో ఒక్క ఓటు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే.. ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించాలంటే.. 154 మంది సభ్యులు.. 22 మంది చొప్పున ఏడు గ్రూప్‌లుగా ఏర్పడి వారికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్త పడాలని.. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించేలా చూడాలని వైసీపీ పోల్ మేనేజర్‌లకు సీఎం జగన్ సూచించారు. చెల్లని ఓట్లు పడే ప్రమాదం ఉందని పసిగట్టిన సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్సీ బ్యాలెట్‌లో ప్రాధాన్యత ఓట్లు వేయడంపై పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా అవగాహన కల్పించాలని సూచించారు. 

దీంతో వైసీపీ తన సొంత పార్టీతో పాటు మద్దతు  తెలుపుతున్న ఎమ్మెల్యేలను ఏడు గ్రూపులుగా విభజించింది. ఒక్కో గ్రూపులో 22 మంది సభ్యులు ఉంటారు. ఒక్కో గ్రూపు నుంచి ముగ్గురు వ్యక్తులకు గ్రూప్‌లోని ఇతర సభ్యులతో సమన్వయం చేసుకునే బాధ్యతను అప్పగించారు. తమ అభ్యర్థులకు సక్రమంగా ఓట్లు పడేలా చూసుకోనేలా జాగ్రత్తలు  తీసుకున్నారు. 

మరోవైపు ఈ ఎన్నికల పోలింగ్ రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగనుండటంతో.. తన శాసనసభ్యుల కదలికలపై వైసీపీ నిఘా ఉంచింది. వారికి, టీడీపీకి మధ్య ఎటువంటి సంప్రదింపులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు వైసీపీ, టీడీపీలు ఈ ఎన్నికలకు సంబంధించి తమ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. అయితే రెండు పార్టీలోని రెబల్స్.. ఆ పార్టీల విప్‌కు కట్టుబడటం కష్టమనే మాట వినిపిస్తుంది. 

అభ్యర్థులు, పోలింగ్‌కు సంబంధించిన వివరాలు.. 
మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి.. వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ పోటీ చేస్తున్నారు. మార్చి 23న అసెంబ్లీలోని మొదటి అంతస్తులోని కమిటీ హాల్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక, ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ భవనంలోని మొదటి అంతస్తును ఈసీ వినియోగిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మార్చి 23న రోజంతా ఆ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లను ఉపయోగించవద్దని ఆయన కేబినెట్ మంత్రులకు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios