Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ వెన్నుపోటులో చంద్రబాబుకు బాకులా ఉపయోగపడింది ఆయనే : వైఎస్ జగన్

సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మెయిద జంక్షన్ లోని బహిరంగ సభలో పాల్గొన్న జగన్ నిరుద్యోగ భృతి ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. 

ys jagan fires on tdp government
Author
Vizianagaram, First Published Oct 3, 2018, 5:35 PM IST

విజయనగరం: సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మెయిద జంక్షన్ లోని బహిరంగ సభలో పాల్గొన్న జగన్ నిరుద్యోగ భృతి ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. మరో నాలుగునెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు యువతను మోసం చేసేందుకు నిరుద్యోగభృతిని తెరపైకి తీసుకువచ్చారన్నారు. 

విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి నిరుద్యోగ భృతి అంటూ వాళ్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు 2వేలు చెల్లిస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయలు చెల్లిస్తూనే నెలకు 12 వేల రూపాయలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో నివేదిక వస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా తీసిన పాపాన పోలేదన్నారు. అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. టెట్ వన్, టెట్ టూ అంటూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. 

నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై లాఠీ ఝులిపిస్తున్నారని జగన్ ఆరోపించారు.విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగుల నిరసనలపై పోలీసులు అడ్డుకుని ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 

నెల్లిమర్ల జ్యూట్ మిల్ యాజమాన్యం తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ధాల కాలం కిందట జ్యూట్ మిల్ యాజమాన్యానికి ప్రభుత్వ భూములు లీజుకు ఇచ్చారని ఆ లీజు పూర్తైనా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను యాజమాన్యం తమభూములుగా చెప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. 

విజయనగరం వాసుల దాహర్తిని తీర్చేందుకు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి 220 కోట్లతో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులు చేపట్టారని తెలిపారు. వైఎస్ హయాంలో 30శాతం పనులు పూర్తైనా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. 

చంద్రబాబు బినామీల కోసమే భోగాపురం ఎయిర్ పోర్ట్ అని జగన్‌ విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌  ఈ నియోజకవర్గంలో నిర్మించాలని ప్రజాపతినిధులు నిర్ణయం తీసుకుంటే మంచిదే కానీ మంత్రుల, ఎంపీల భూములు ముట్టుకోకుండా ప్రజల భూములు అన్యాయంగా లాక్కోవడం న్యాయమా అని ప్రశ్నించారు.  రైతుల భూముల లాక్కోని వాళ్ల భూములకు రెట్లు పెంచుకున్నారని జగన్ మండిపడ్డారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్ ను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు దక్కకుండా చంద్రబాబు కుట్రపన్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కాంట్రాక్టు ఇస్తే చంద్రబాబుకు లంచాలు రావని టెండర్లను రద్దు చేశారన్నారు. రెండోసారి టెండర్లు పిలిచినప్పుడు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వాళ్లు ఎక్కడ వస్తారనే భయంతో నిబంధనలు మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 

దేశంలో 130కి పైగా ఎయిర్‌పోర్ట్‌లు ఉంటే అందులో 126 ఎయిర్‌పోర్ట్‌లను ఆ సంస్థే నిర్వహిస్తుందన్నారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనను పక్కనపెట్టారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ అవినీతిలో కేంద్ర మాజీ మంత్రి ఆశోక గజపతిరాజు పాత్ర కూడా ఉందన్నారు. ఆయన మంత్రిత్వ శాఖలో చంద్రబాబు బరితెగించి అవినీతి చేస్తోంటే నిలదీయాల్సిన మంత్రి ఆయన తాన అంటే తందానా అంటున్నారన్నారు. 

చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నపోటు పోడిసిన సమయంలో ఆయనకు బాకులా అశోక్ పనిచేశారన్నారు. నాలుగున్నర ఏళ్లు బీజేపీతో కాపురం చేసిన ఈ మంత్రి క్యాబినేట్‌ మీటింగ్‌లలో కూర్చుంటాడు కానీ రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా గురించి అడగడానికి మాటలు రావు. ఇలాంటి మంత్రి ఈ జిల్లాలో ఉన్నాడంటే ప్రజలు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో 108 పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 27 అంబులెన్స్ లు ఉంటే అందులో 10 అంబులెన్స్ లు షెడ్ కు పరిమితమయ్యాని జగన్ అన్నారు. గతంలో 108 కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ మంటూ వచ్చే అంబులెన్స్ నేడు మూగబోయిందన్నారు. అదే సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆటోలో తీసుకెళ్తుంటే జగన్ చలించిపోయారు. 

అంబులెన్స్ లు లేక గర్భిణీ స్త్రీలను ఆటోలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 108 సిబ్బందికి జీతాలు చెల్లించి వాళ్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 108 సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి చోద్యం చూస్తుందని మండిపడ్డారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios