Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూ దందా: వైఎస్ జగన్ ధ్వజం

భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి మాట దేవుడెరుగు ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు భూములు దోచేస్తున్నారని ఆరోపించారు.  

ys jagan fies on tdp minister ganta
Author
Visakhapatnam, First Published Sep 17, 2018, 7:21 PM IST

విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి మాట దేవుడెరుగు ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు భూములు దోచేస్తున్నారని ఆరోపించారు.  

ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు ఎక్కడా కనిపించడం లేదని ఎక్కడైనా కనిపిస్తే మాయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మంత్రి గంటా శ్రీనివాస రావు సీఎం చంద్రబాబు ట్రైనింగ్‌లో ఆరితేరిపోయాడన్నారు. ఎన్నికలు వచ్చేప్పటికి దొంగల ముఠా స్థావరాలు మార్చినట్లు గంటా  తన నియోజకవర్గాలను మారుస్తాడంటూ ఎద్దేవా చేశారు. 

వచ్చే ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి పోటీ చెయ్యరంటూ జగన్ అభిప్రాయడ్డారు. భీమిలీ, ఆనందపురం, మధురవాడ తహసీల్దార్‌ ఆఫీసుల్లో జరిగిన అవినీతిపై సీట్‌ ముందు ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. 

మంత్రి గంటా శ్రీనివాసరావు అండదండలతో అధికారులు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని,హుద్‌ హుద్‌ తుఫాను పేరుతో రికార్డులను మాయం చేశారని జగన్ ఆరోపించారు. తుఫాన్‌ పేరుతో ఎమ్మార్వో ఆఫీసుల్లో ఎఫ్‌ఎంబీలు, ఆర్‌ఎంబీలు, మ్యాపులు పోయాయని చెప్పి రికార్డులను తారుమారు చేసి భూములను దోచుకుంటున్నారన్నారు. పేదలను భయపెట్టి అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి ల్యాండ్ ఫూలింగ్ పేరుతో దందా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ అత్యంత దారుణంగా తయారైందని జగన్ దుయ్యబుట్టారు. నారాయణ విద్యాసంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు కావడంతో ఫీజుల బాదుడుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి మౌనంగా ఉంటారన్నారు. 

వియ్యంకులిద్దరూ ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి నారాయణ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్ట్‌లను భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్‌ మూర్తికి చెందిన గీతం యూనివర్సిటీకి విద్యార్థులు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. 

మరోవైపు గంటా శ్రీనివాసరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చెయ్యలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వేల మందికి ఉపాధి కల్పించే చిట్టివలస జ్యూట్ మిల్ ను టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే తెరిపిస్తానన్నారని నాలుగున్నరేళ్లు అవుతున్నా నేటికి జ్యూట్ మిల్లు తెరుచుకోలేదన్నారు. 

కనీసం కార్మికులకు రూ.119 కోట్లు బకాయిలు ఉంటే అవి కూడా చెల్లించే ప్రయత్నం చెయ్యలేదన్నారు. జ్యూట్ మిల్లుకు చెందిన రెండెకరాల గోడౌన్‌ స్థలాన్ని ఇతరుల చేత కొనుగోలు చేయించి ఆ సొమ్ముతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. 

విశాఖపట్నంలో సమ్మిట్‌ పేరుతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించారని ఆ సమావేశంలో మూడు రోజులు తినేందుకు 53 కోట్లు ఖర్చు పెట్టారని జగన్ తెలిపారు. సమ్మిట్ ద్వారా 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారని ఎవరికైనా వచ్చాయా అంటూ ప్రశ్నించారు. 

ఉత్తరాంధ్రలో 35 జ్యూట్ మిల్లులు ఉంటే కేవలం 18 జ్యూట్ మిల్లులు మాత్రమే నడుస్తున్నాయని చెప్పారు. జ్యూట్ మిల్లులు మూసివేయడం వల్ల 30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 వైఎస్ఆర్ హయాంలో కరెంట్ యూనిట్ ధర రూ.3.15 పైసలు ఉంటే చంద్రబాబు నాయుడు అదే యూనిట్ ధరను రూ.8.40 పైసలకు పెంచారని ఇలా పెంచుకుంటూ పోతే జ్యూట్ మిల్లులు మూతపడక తెరచుకుంటాయా అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగలు ఊడిపోతున్నా ప్రభుత్వాని చీమకుట్టినట్లైనా లేదన్నారు.  

పోలవరం ప్రాజెక్టు పనులను చూస్తే పునాది గోడలు దాటలేదని కానీ చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులతో గ్యాలరీ వాక్‌ చేస్తారని జగన్ ఎద్దేవా చేశారు. పునాదులు వేసి గృహ ప్రవేశానికి పిలిస్తే పిచ్చోడంటారని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారని జగన్ మండిపడ్డారు. 

మరోవైపు చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయిందన్న జగన్ ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించదంటున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి చికిత్స రూ. వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు. ఆపరేషన్‌ చేశాక విశ్రాంతి సమయంలో పేషెంట్‌కు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios