అమరావతి: ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ లో టెన్షన్ పెరుగుతోందట. అదేంటంటే ఆయన ఓడిపోతారోననో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనో కాదట. ఆయనకు అత్యంత సన్నిహితులైన వైసీపీ నేతల గెలుపుపై జగన్ ఆతృతగా ఎదురుచూస్తున్నారట. 

నియోజకవర్గాల అభ్యర్థులతోపాటు ఆయా నేతలను అడిగి తెలుసుకుంటున్నారట. ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరా అనుకుంటున్నారా...? ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. 

గతంలో అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డ వీరు ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అంతేకాదు గతంలో ఈ ముగ్గురు సిట్టింగ్ లపై తలపడ్డ వారిని కాకుండా బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ. దీంతో ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిపై వైఎస్ జగన్ ఆసక్తిగా తెలుసుకుంటున్నారట. 

ఇకపోతే వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని చెప్పుకోవాలి. న్యాయపరమైన సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ఆర్కే పరిస్థితిపై జగన్ ఆరా తీస్తున్నారట. 

ఆర్కేపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఆర్కే గెలుస్తారంటూ సర్వేలు చెప్తున్నప్పటికీ జగన్ మాత్రం ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ ఫీలవుతున్నారట. 

నారా లోకేష్ సీఎం తనయుడుగా మంత్రిగా బరిలో దిగినప్పటికీ స్థానికుడిగా, మంచి వ్యక్తిగా పేరుండటంతో ప్రజలు ఆర్కే కే ఓటు వేశారని పెద్ద ఎత్తునప్రచారం జరుగుతోంది. అంతేకాదు అనేక సర్వేలు సైతం ఆర్కే గెలుపు తథ్యమంటూ చెప్తున్నాయి. ఆ సర్వేలు చూసి కాసేపు ఆనందపడుతున్నా కానీ మనసంతా మాత్రం అక్కడే ఉందట వైఎస్ జగన్ ది. 

ఇకపోతే వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులలో మరొక నేత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ పై మంత్రి నారాయణను బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ. ఆర్థికంగా, అన్ని రంగాలలో అనిల్ కుమార్ యాదవ్ కంటే ధీటైన వ్యక్తి కావడంతో పోలింగ్ ఎలా జరిగిందోనని జగన్ ఆరా తీస్తున్నారట. 

ఎన్నికల్లో మంత్రి నారాయణ కోట్లాది రూపాయలు వెదజల్లారంటూ నానా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారట. 

ఇకపోతే మూడో కీలకమైన నేత, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. రోజా గెలవడం ఖాయం, జగన్ కేబినేట్ లో మంత్రి అయిపోవడం కూడా ఖాయమంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. 

టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్ కు టీడీపీ నేతల నుంచే సహాయ నిరాకరణ వ్యక్తమైందని, కుటుంబ సభ్యులు సైతం అంతగా సహకరించలేదని ఈ పరిణామాలు రోజాకు కలిసి వస్తాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న తమిళ ఓటర్లు రోజావైపే మెుగ్గు చూపారని తెలుస్తోంది. 

దీంతో రోజా గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. అటు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. సర్వేలు చూసి జగన్ ధీమాగా ఉన్నప్పటికీ మనసంతా మాత్రం ఆ మూడు నియోజకవర్గాలపైనే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.