కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 నెలల విరామం అనంతరం సొంత ఇలాఖా అయిన కడప జిల్లాలో అడుగుపెట్టారు. కడప జిల్లాలో అడుగుపెట్టిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ రాకతో కడప జిల్లాలో సందడి నెలకొంది. 

పులి వెందుల పులిబిడ్డ, కాబోయే సీఎం అటూ ప్రజల నినాదాలతో కడప జిల్లా మార్మోగుతోంది. పాదయాత్ర ముగించుకుని కడప జిల్లా పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ ఇడుపులపాయలోని దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. 

అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ జగన్ తోపాటు, తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్ జగన్ పులివెందుల నుంచి చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లి వద్ద వేంచేసియున్న గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. 

ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించున్న జగన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సమేతంగా వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని, అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్నారు. అయితే ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో ఆయన మొక్కులు చెల్లించుకోవాలని సంకల్పించుకున్నారు. 

ఈ నేపథ్యంలో గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్నారు. శనివారం గండి వీరంజనేయస్వామి క్షేత్రం, సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మెుక్కులు చెల్లించుకున్నారు వైఎస్ జగన్.