అనంతపురం: బ్యాంకుల్లో అప్పులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆడపడుచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా ఆదుకుంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

డ్వాక్రా మహిళలకు ఎంత అప్పు ఉన్నా ఆ అప్పును రద్దు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున అన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని తెలిపారు. అనంతపురం జిల్లాలో వైసీపీ సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్వాక్రా మహిళలకు వరాలజల్లు కురిపించారు. 

మరోవైపు అన్న చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు నాలుగు దఫాలుగా రూ.75వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ ఇంటి నుంచి పిల్లలను బడికి పంపితే చాలు వారి బాధ్యతను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చదువుకుంటున్న ప్రతీ విద్యార్థి ఇంటికి ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

అలాగే వృద్ధాప్య పింఛన్ ను రూ.2000 నుంచి రూ.3000 వరకు పెంచుకుంటూ పోతానని హామీ ఇచ్చారు. ప్రతీ వైసీపీ కార్యకర్త ప్రజలకు చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఏం చెయ్యబోతున్నామో అన్నది ప్రతీ అవ్వకు వివరించాలని తెలిపారు. అన్నవస్తాడు కష్టాలు తీరుస్తాడని భరోసా ఇవ్వాలని తెలిపారు. 

అంతేకాదు అనారోగ్యం పాలైన ప్రతీ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. రూ.1000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోందని భరోసా ఇచ్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రూ.3000 ఇస్తే రూ.5000కావాలని అడగండి, ఓటు మాత్రం ఆలోచించి వెయ్యండి: వైఎస్ జగన్

మీకు తగిలిన గాయం నా గుండెకు తగిలింది: వైసీపీ శంఖారావంలో వైఎస్ జగన్