అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏక వాక్య తీర్మానంతో శాసనసభా పక్షం ఆయనను తమ నేతగా ఎన్నుకుంది. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో వైసిపి శాసనసభా పక్ష సమావేశం శనివారం ఉదయం జరిగింది.

శాసనసభా పక్ష నేతగా జగన్ పేరును బొత్స సత్యనారాయణ ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, ఆదిమూలపు సురేష్‌, రాజన్నదొర, బుగ్గన రాజేంద్రనాథ్‌, ముస్తాఫా, ఆళ్ల నాని, ప్రసాదరాజు, కోన రఘుపతి, ఆర్కే రోజా, విశ్వరూప్‌, నారాయణస్వామి బలపరిచారు. ఆ తర్వాత ధర్మాన, బుగ్గనలతో కలిసి హైదరాబాదు బయలుదేరారు. తాను వైసిపి ఎల్పీ నేతగా ఎన్నికైన తీర్మానం ప్రతిని ఆయన గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నారు. 

శాసనసభకు ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శనివారం ఉదయం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ కరకట్ట నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ఎమ్మెల్యేలు దాదాపు 5 మీటర్ల మేర కాలినడకన జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. 

వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 15 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.