వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకనుంచి ఆయన వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకనుంచి ఆయన వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారు. ఈ విషయాన్ని వైసీపీ ప్లీనరీ వేదికగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. దీంతో వేదికపై ఉన్న మంత్రులు, పార్టీ నాయకులు, ప్లీనరీకి హాజరైన పార్టీ శ్రేణులు సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. అంతకు ముందు రెండో రోజు ప్లీనరీ సమావేశాల సందర్బంగా.. పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత, వ్యవసాయం, సామాజిక సాధికారత, పరిశ్రమల ప్రోత్సహకాలు, ఎల్లో మీడియా-దుష్టచతుష్టయం తీర్మానాలను ఆమోదించారు.
అనంతరం పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేసినట్టుగా విజయసాయి రెడ్డి తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న పేరును.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)గా మార్చుతూ సవరణ చేసినట్టుగా చెప్పారు. అలాగే పార్టీ అధ్యక్షుడి పదవిని.. జీవితకాల అధ్యక్షుడిగా పదవిగా మార్చుతూ సవరణ చేసినట్టుగా తెలిపారు. వీటికి ప్లీనరీలో ఆమోదం తెలిపారు. జూలై 8 2022 పార్టీ ప్లీనరీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా చెప్పారు. మొత్తంగా వైఎస్ జగన్ తరఫున 22 సెట్ల నామినేషన్‌లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. మిగిలిన ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని చెప్పారు.
