హైదరాబాద్‌: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలపై వైఎస్ జగన్ కండీషన్లు పెడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరాలనుకునే వారికి జగన్ పెట్టే కండీషన్స్ చాలానే ఉన్నాయట. రాజకీయాల్లో విశ్వసనీయత, ప్రజాస్వామ్య విలువలు పాటించాలంటూ పదే పదే చెప్పే జగన్ వాటిని తూచ తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కండీషన్స్ పెడుతున్నారట. 

ఆ విషయంలో రాజీపడేది లేదని తెగేసి చెప్తున్నారట. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరే నేతలు ముందుగా తమ పదవులకు రాజీనామా చెయ్యాలని మెుదటి  కండీషన్ పెడుతున్నారట. ఇక రెండోది ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలని మరో కండీషన్ పెడుతున్నారట. 

ఎమ్మెల్యే పదవి ఉన్నా సరే దాన్ని వదులుకుంటేనే పార్టీలోకి రావాలని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు వైఎస్ జగన్. అలాగే పార్టీలో చేరే వ్యక్తులకు పార్టీ తప్పక గౌరవం ఇస్తుంది కానీ టిక్కెట్ల విషయం పార్టీ అధిష్టానానికి వదిలేసి ప్రజల కోసం పనిచెయ్యాలంటూ మరో కండీషన్ పెడుతున్నారట. 

ఈ కండీషన్స్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి ఎదురైంది. మేడా మల్లికార్జునరెడ్డి సోదరులు ముగ్గురు కూడా వైసీపీలో చేరేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వెళ్లారు. వైఎస్  జగన్ ను కలిసి పార్టీలో చేరబోతున్న విషయంపై చర్చించారు. 

అప్పటికే తెలుగుదేశం పార్టీ మేడా మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేసింది. పనిలో పనిగా జగన్ ఒప్పుకుంటే వైసీపీ కండువా కప్పేసుకుందామని సంబరపడ్డారు మేడా సోదరులు. అయితే అంతా విన్న వైఎస్ జగన్ మేడా మల్లికార్జునరెడ్డిని పార్టీకి ఎమ్మెల్యే పదవికి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారా అని ప్రశ్నించారట. 

ఇప్పటికే ప్రభుత్వ విప్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. అయితే స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి ఈనెల 31న పార్టీలో చేరాలంటూ జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాలను విన్న మేడా మల్లికార్జునరెడ్డి బుధవారం స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో నైతిక విలువలు కలిగిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ప్రజా స్వామ్య విలువలు తెలిసిన యువనేత వైఎస్ జగన్ అంటూ ప్రశంసించారు.  వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు రాజకీయ విలువలు దిగజార్చారని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. 

రాజకీయాల్లో  విలువలు, విశ్వసనీయత ముఖ్యమని జగన్ చెప్పుకొచ్చారని అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు అంటూ చెప్పారు మేడా మల్లికార్జునరెడ్డి. ఇకపోతే గతంలో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలోనూ వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరుతానని వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే రావాలని షరతు పెట్టారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్. 

వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.