చింతమనేని వనజాక్షి జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు: జగన్ వ్యాఖ్య

YS Jagan comments on Vanajakshi issue
Highlights

ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తాహిస్ ల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు.

ఏలూరు: ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తాహిస్ ల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. అటువంటి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సింది పోయి పంచాయతీ చేశారని ఆయన అన్నారు. 

జగన్ ప్రజా సంకల్ప యాత్ర సోమవారం 2 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పైలాన్ ను ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బస్ స్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. 

ప్రజల ఆశీస్సులు, ప్రేమతోనే తాను 2 వేల కిలోమీటర్లు నడిచానని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మట్టి వరకు దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారని అన్నారు. పిల్లలు మద్యం తాగి చెడుపోతున్నారని అంటున్న చంద్రబాబు మద్యం కట్టడికి ఇచ్చిన హామీని అమలు చేయలేదని అన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, యథా రాజా తధా ఎమ్మెల్యేలు అన్నట్లు చంద్రబాబు పాలన ఉందని ఆయన అన్నారు. ఈ ఒక్క జిల్లాలోనే రూ. 400 కోట్ల మేర అక్రమ తవ్వకాలు జరిగాయని అన్నారు. ఎమ్మెల్యే నుంచి కలెక్టర్ వరకు, చినబాబు నుంచి పెదబాబు వరకు లంచాలేనని అన్నారు. 

ఎమ్మెల్యే శేషారావు గోదావరి నది ఇసుకను కూడా వదలడం లేదని అన్నారు. లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు పాలన హత్య చేసే పాలన అని, నాలుగేళ్లలో ఈ జిల్లాలో ఏడు హత్యలు జరిగాయని అన్నారు.

చంద్రబాబు హైటెక్ పాలనలో ఫోన్ కొడితే ఇంటికి మద్యం వస్తోందని అన్నారు. నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు హామీలపై తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. చంద్రబాబు ప్రజల గుండెల్లో గునపాలు దింపారని అన్నారు.

loader