అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అధికారులను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో తన తండ్రి హయాంలో అత్యంత నమ్మకంగా, సమర్థంగా పనిచేసిన అధికారులకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ధనంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే.

ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేలోగానే తన కార్యాలయంలో ఉండాల్సిన అధికారులను ఆయన ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కడప జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎంటి కృష్ణ బాబు సిఎంవోలోకి రావచ్చునని అంటున్నారు. ఆయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేశారు. మంగళూరు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు. 

మరో అధికారి ఆదిత్యనాథ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007 నుంచి 9 ఏళ్ల పాటు జలవనరుల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పథకం అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు. జగన్ నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనను తన కొలువులోకి తీసుకుంటారని సమాచారం. 

గిరిజా శంకర్ ను సిఎంవోలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం సిఎంవోలోనే ఉన్నారు. నూతన డీజీపిగా గౌతం సవాంగ్ నియమితులు కావచ్చునని అంటున్నారు. ఆంజనేయులు నిఘా విభాగం ఐజిగా వచ్చే అవకాశాలున్నాయి.