అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌ అనంతరం మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. 

జూన్ 7న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ తొలుత 9 మంది లేదా 11 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేయాలా లేక 25 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేయాలా అనే అంశంపై వైయస్ జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని ఒక్కో జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడే జిల్లాల ఏర్పాటు అనేది సాధ్యం కాని నేపథ్యంలో 25 పార్లమెంట్ స్థానాల నుంచి 25 మందికి జగన్ కేబినెట్ లో మంత్రులుగా అవకాశం కల్పిస్తారా అన్న చర్చ జరుగుతుంది. 

లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల నుంచి 13 మందిని మంత్రులుగా ప్రకటించి అనంతరం మరోసారి మరికొంతమందిని తీసుకుంటారా అన్న అంశాలపై వైయస్ జగన్ టీం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.