విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలన వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయమేస్తోదని, చంద్రబాబు వస్తే మహిళలకు బాగుంటుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన అడ్వర్టయిజ్ మెంట్లు అందరికీ గుర్తుండే ఉంటాయని, ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులు నిజంగా భయం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

ఒక్క గుంటూరు జిల్లాలోనే 4 రోజుల్లో 11 కేసులు నమోదయ్యాయని, మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద నాలుగు నెలల్లో 281 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 

ఇన్ని ఘటనలు జరిగాయంటే తప్పు చేస్తే ప్రభుత్వ పెద్దలు కాపాడుతారనే ధీమా పెరగడం వల్లనే కాదా అని ఆయన ప్రశ్నించారు. మృగాళ్లు ఇంతగా పెట్రేగి పోవడానికి చంద్రబాబు పాలన కారణం కాదా అని అడిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన శనివారం కృష్ణా జిల్లా పెడనలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

చంద్రబాబు పాలనలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు విపరీతంగా పెరిగాయని, ఆయన పారిపాలించే తీరు మనుషులను మృగాలుగా మార్చేస్తోందని జగన్ అన్నారు. మీరు అడ్డంగా దోచుకోండి... దానిలో మీకింత నాకింత అని అధికారంలో ఉన్నవారు ప్రేరేపిస్తే మనిషి మృగమే అవుతాడని ఆయన అన్నారు. 

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులుంటే, వారిలో ఇద్దరు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. 

అధికారి వనజాక్షిపై దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్ మనీ వ్యవహారాల్లో ప్రభుత్వం తీరు చూస్తుంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్ారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ముఖ్యమంత్రి నవ్వుతూ చెప్పి ఆడవాళ్లను అవమానిస్తున్నారని ఆయన అన్నారు.