వైఎస్సార్ కాంగ్రెస పార్టీ ప్లీనరీకి అంతా సిద్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది.

వైఎస్సార్ కాంగ్రెస పార్టీ ప్లీనరీకి అంతా సిద్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేయనున్నారు. అలాగే ఈ ప్లీనరీ వేదికగా వైఎస్ జగన్‌ను వైసీపీ శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరుకు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. 

వైఎస్ జగన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నియమించేందుకు.. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పార్టీ బైలాని, నియమావళిని మార్చనున్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానానికి ప్లీనరీలో ఆమోదం తెలుపనున్నారు. దీంతో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ కొనసాగనున్నారు. ఇలా చేయడం ద్వారా వైసీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతికి ఉన్న సమయంలో ఇదే తరహాలో అన్నా డీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి అయ్యారు. 

ఇక, జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. సీఎం జగన్ రేపు ఉదయం పులివెందులలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు వైసీపీ ప్లీనరీ సమావేశాలకు హాజరవుతారు. సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీలో 9 తీర్మానాలు ప్రవేశపెట్టి.. వాటికి ఆమోదం తెలుపనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. జూలై 9వ తేదీన సీఎం జగన్ ముగింపు ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి. 

ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. తొలిసారిగా 2011లో వైసీపీ ప్లీనరీ జరిగింది. తర్వాత 2017లో ప్లీనరీని నిర్వహించారు. అదే వేదికపై నుంచి జగన్.. నవరత్నాలను ప్రకటించారు. ఆ తర్వాత ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక, వైసీపీ అధికారంలో వచ్చిన మూడేళ్ల తర్వాత మరోసారి పార్టీ ప్లీనరీని నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమే ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.