న్యూఢిల్లీ:  అవినీతి లేని పాలనను అందిస్తానని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. తమ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్టుగా ఆయన ప్రకటించారు.దేశంలోనే తమ పాలన ఆదర్శంగా ఉండేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు.మరో వైపు మద్యపానం నిషేధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లను అడుగుతానని జగన్ తేల్చి చెప్పారు.

న్యూఢిల్లీలో ఆదివారం నాడు ప్రధానమంత్రి మోడీతో భేటీ అయిన తర్వాత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి మద్య నిషేధం విధించిన తర్వాతే ఓట్లను అడుగుతానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. దశలవారీగా మద్యపానాన్ని నిషేధం విధించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే దశలవారీగా మద్యనిషేధం అమలు చేసేందుకు కార్యాచరణను సిద్దంచేస్తామన్నారు.

 ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం  సేకరించిన భూముల్లో  అవినీతి చోటు చేసుకొందని జగన్ ఆరోపించారు.మేలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, రాజధాని ఎక్కడ వస్తోందో చంద్రబాబునాయుడుకు ముందే తెలుసునని జగన్ ఆరోపించారు. ఈ ప్రాంతంలోనే చంద్రబాబు బినామీలు భూములను కొనుగోలు చేశారని జగన్ విమర్శించారు.

చంద్రబాబు నాయుడు బినామీలు రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంలో భూములను  ముందే కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.రాజధాని నిర్మాణం కోసం  రైతుల నుండి  బలవంతంగా భూములను  లాక్కొన్నారని జగన్ ఆరోపించారు. కానీ, చంద్రబాబు బినామీల నుండి మాత్రం భూములను సేకరించలేదన్నారు.

అవినీతి ఎక్కడా కూడ లేకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి శాఖలో కూడ అవినీతిని నిర్మూలిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో ప్రజా ధనాన్ని ఏ మేరకు పొదుపు చేశామో ప్రజలకు వివరించనున్నట్టు జగన్ తేల్చి చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడ అమల్లోకి తీసుకొస్తామన్నారు.

కుంభకోణాలు ఎక్కడ జరిగాయో గుర్తించి చర్యలు తీసుకొంటామని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు చోటు చేసుకొన్నాయని ఆయన ఆరోపించారు. వీటన్నింటిని వెలికి తీస్తామన్నారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేయనున్నట్టు జగన్ వివరించారు. ఏపీ ప్రజలకు కూడ సమస్యలు ఏమిటనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పారదర్శకంగా అన్నీ పనులు సాగేలా చర్యలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ప్రత్యేక హోదా విషయంలో వెనక్కు తగ్గను: జగన్

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు