ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.

హైదరాబాద్‌: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని కోర్టును కోరారు. సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ విచారణ జరిగిందని.. ఈ నేపథ్యంలో మొదట సీబీఐ కేసులు లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. 

ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి.. సీబీఐ, ఈడీ కేసులు వేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని.. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా మనీలాండరింగ్ అభియోగాలపై విచారణ జరపవచ్చన్నారు. 

సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జ్‌షీట్లపై విచారణ జరపాలన్న అదనపు ఎస్‌జీ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది.