వైఎస్ వివేకా హత్య కేసు: నేడు సీబీఐ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం నాడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ విషయమై గతంలోనే సీబీఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన సీబీఐ అధికారుల విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే.
కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న అతిథిగృహంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు గాను వైఎస్ భాస్కర్ రెడ్డి ఇవాళ పులివెందుల నుండి కడపకు బయలుదేరారు. భాస్కర్ రెడ్డి వెంట ఆయన అనుచరులు కూడా ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు రోజున ఏ-2 సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై భాస్కర్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తమకు సంబంధం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో పెళ్లి కీలకమని ఆయన ఆరోపించారు. రెండో భార్య కొడుకును రాజకీయ వారసుడిగా చేయాలని వివేకానందరెడ్డి భావించారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్తుల గొడవ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని అవినాష్ రెడ్డి రెండు రోజుల క్రితమే మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.
also read:రెండో పెళ్లే కీలకం: వైఎస్ వివేకా హత్యపై వైఎస్ అవినాష్ రెడ్డి సంచలనం
2019 మార్చి 19వ తేదీన పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 13వ తేదీ వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసును సీబీఐతో విచారించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.