Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి.. ఆ విషయాలపై అధికారులకు రిక్వెస్ట్..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు‌కు సంబంధించి సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.

ys avinash reddy to appear before cbi today in ys vivekananda reddy murder case
Author
First Published Jan 28, 2023, 10:39 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. నేడు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు.. అందుకు సంబంధించి అంశాలపై ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది. సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సిద్దమయ్యారు. అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీబీఐ అధికారులు ఎదుట హాజరుకానున్నారు. 

ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి తొలుత సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున.. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీచేసిన సీబీఐ.. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని తెలిపారు. 

ఇక, తనకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేయడంపై స్పందించిన  అవినాష్ రెడ్డి.. రెండున్నరేళ్లుగా తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తాను ఎలాంటివాడినో జిల్లా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలవాలని.. నిజం తేలాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో కుటుంబాలు ఎలా ఫీలవుతాయో ఊహించుకోండి అంటూ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios