వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం వల్లే కుటుంబంలో తీవ్ర విభేదాలు తల్లెత్తాయని.. అవే అతని హత్యకు దారి తీశాయని వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసిందని తెలుపుతూ.. దీనిమీద తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. వీటితోపాటు పిటిషన్ లో ఆయన అనేక కీలక విషయాలను కూడా చేర్చారు. వైయస్ వివేకా కూతురు సునీతకు, వివేకాకు మధ్య తీవ్ర మనస్పర్ధలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు తెలుపుతూ..
‘ వైఎస్ వివేకానంద రెడ్డి 2010లో షేక్ షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత నుంచే వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వివేకా రెండో భార్య షమీమ్ ను .. వివేకా కూతురు సునీత, ఆమె భర్త ఎస్ రాజశేఖర్ రెడ్డి, బావ ఎన్ శివప్రకాశ్ రెడ్డి శత్రువుగా చూసేవారు. పలు కంపెనీలో డైరెక్టర్ గా సునీత రాజశేఖర్ రెడ్డిలతో పాటు వివేకానంద రెడ్డి కూడా ఉన్నారు. ఈ విభేదాల కారణంగానే వారు ఆ కంపెనీలో వివేకానంద రెడ్డి చెక్ పవర్ ను రద్దు చేశారు. వివేకానంద రెడ్డి ఈ కారణంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య: సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ
వివేకానంద రెడ్డి మొదటి భార్య, కూతురు హైదరాబాదులో ఉండేవారు వివేకానంద్ రెడ్డి మాత్రం ఎక్కువగా పులివెందులలోనే గడిపేవారు. ఈ క్రమంలోనే ఒక దశలో షమీమ్ కుమారుడినే వివేకానంద రెడ్డి తన వారసుడిగా ప్రకటిస్తారని ఊహాగానాలు వెలుపడ్డాయి. ఈ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు పుట్టాయి. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏ1నుంచి ఏ4వరకు ఉన్న నిందితుల ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా తెలుస్తోంది. సొంత కుటుంబసభ్యులే దీనికి పాల్పడి ఉంటారని వీటిని పరిశీలిస్తుంటే తెలుస్తోంది.
ఆయనని వదిలించుకోవడానికి పథకం ప్రకారం ఈ పనికి పూనుకున్నట్లుగా అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత షమీమ్ దర్యాప్తులో మాట్లాడుతూ సునీత, ఆమె కుటుంబ సభ్యులు బెదిరించినట్లుగా తెలిపారు. వివేకానంద రెడ్డి తన కుమారుడి పేరుమీద రెండు కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నారని చెప్పుకొచ్చారు’ అని అవినాష్ రెడ్డి పిటిషన్ లోతెలిపారు.
అవినాష్ రెడ్డి పేర్కొన్న మరిన్ని విషయాల్లో.. ‘వివేకానంద రెడ్డి హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి టిడిపి ఎమ్మెల్సీ ఏం రవీంద్రనాథ్ రెడ్డిని కలిశారు. బీటెక్ రవి ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో చర్చలు జరిపారు. మొదట సునీత నామీద ఆరోపణలు చేయలేదు. పైగా.. నా విజయం కోసం వివేకానంద రెడ్డి చాలా శ్రమించారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నా విజయం కోసం జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో కలిసి చర్చలు జరిపిన తరువాతే నా మీద ఆరోపణలకు తెరలేపారు.
ఎలాంటి సాక్ష్యాదారాలు నామీద లేకపోయినా కూడా దస్తగిరి అక్కడ, ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ అవుట్ ఫోన్ లొకేషన్ అనే పేరుతో నన్ను సిబిఐ వేధింపులకు గురిచేస్తుంది. హత్యా ప్రాంతంలో దొరికిన లెటర్ మీద దర్యాప్తు చేయడం లేదు. తప్పుడు సాక్షాలు చెప్పేలా ఒత్తిడి చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులను ఆదేశించాలంటూ’ అవినాష్ రెడ్డి పిటిషన్ లో అభ్యర్థించారు.
