మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు సీజే బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందని పేర్కొన్న అవినాష్ రెడ్డి.. అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉన్న అన్ని పిటిషన్‌ల వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అవినాష్ రెడ్డి అభ్యర్థనపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినాష్ రెడ్డి.. సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇక, ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. ఈరోజు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భాస్కర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న సీబీఐ..
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఇది జరిగిన 48 గంట్లలోనే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందులలోని వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి రెండు వాహనాల్లో చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన కుటుంబ సభ్యులకు అరెస్ట్ మెమో అందజేశారు.
అనంతరం భాస్కర్ రెడ్డిని హైదరాబాద్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ కస్టడీ పిటిషన్‌పై వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది సోమవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు.
