మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. అయితే ఆయన రెండోసారి ఓ లేఖను సీబీఐ అధికారులకు అందజేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 4.30 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. అయితే ఆయన రెండోసారి విచారణకు హాజరైన నేపథ్యంలో ఓ లేఖను సీబీఐ అధికారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే.. ఆమెను తాను బెదిరించి వచ్చినట్లు టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెట్టి దుష్ప్రచారం చేశారని అవినాశ్ రెడ్డి మండిపడ్డారు. తాను దుబాయ్‌కి వెళ్లానని వక్రీకరించి వార్తలు రాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన రోజున మార్చురి వద్ద , ఆ తర్వాత రెండు రోజులకు మరోసారి మీడియాతో మాట్లాడానని.. అప్పుడు ఏ విషయాలు వెల్లడించానో, ఇవాళ అధికారులకూ అదే చెప్పానని అవినాశ్ రెడ్డి గుర్తుచేశారు. విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నానని.. హత్య జరిగిన రోజు తాను వెళ్లేటప్పటికే లేఖ వుందని అవినాశ్ రెడ్డి చెప్పారు. 

ALso Read: బీజేపీలోని కోవర్టులతో సీబీఐని కంట్రోల్.. వివేకా కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబుదే : సజ్జల వ్యాఖ్యలు

ఇదిలావుండగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఫిబ్రవరి 22న తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హత్య కేసులో ఏ2గా వున్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సునీల్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల విక్రయాలు చేసేవాడని, వివేకా హెచ్చరించడంతో ఆయనపై కోపం పెంచుకున్నాడని సీబీఐ పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని.. సీబీఐ కౌంటర్‌లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో డీల్ కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ తెలిపింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే వున్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. అవినాశ్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసునని , అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ పాత్ర వుందని సీబీఐ తెలిపింది. 

కాగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ నెల 18న సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇప్పటికే ఇక ఈ కేసుకు సంబంధించి గత నెల 28న అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.