ప్రేయసి పరీక్ష కోసం ఓ వ్యక్తి దొంగలా మారాడు. ఆమె పరీక్షకు ఎలాగైనా డబ్బు ఇవ్వాలని... దొంగతనం చేశాడు. సినీ ఫక్కీలో చోరీకి పాల్పడినా.... పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... చంద్రగిరి మండలంలోని కేఎంఎం కళాశాల వద్ద విద్యార్థి భరత్‌ తన యమహా బైకుకు తాళాలు పెట్టి మరిచిపోయి తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. తిరిగొచ్చి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. చోరీ జరిగినట్లు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇదిలా ఉండగా... ట్రాఫిక్ పోలీసులు విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అనుమానం వచ్చి బైక్‌ రికార్డులు అడగ్గా అతడి వద్ద లేవు. అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్‌ తనది కాదని బీఎన్‌ కండ్రిగ మండలం నీర్పాకోటకు చెందిన అఖిల్‌ తన వద్ద రూ.15వేలకు తనఖా పెట్టాడని చెప్పాడు.

అఖిల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ప్రేమించిన అమ్మాయి పరీక్ష ఫీజు కోసమే బైక్‌ను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అఖిల్‌ని అరెస్టు చేసి.. సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు. 

కాగా అఖిల్ ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు. ఇంకా ఉద్యోగం రాలేదు.గత కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కోసమే... అఖిల్ దొంగతనానికి పాల్పడటం విశేషం.