బాలుడిపై లైంగిక దాడి చేసిన యువకుడు.. 20 యేళ్లు కఠిన కారాగారశిక్ష...
విజయవాడలో ఓ యువకుడు మైనర్ బాలుడి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నాలుగేళ్ల తరువాత తీర్పు వెలువడింది. అతడిని 20యేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు న్యాయమూర్తి.
విజయవాడ : బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు కఠిన కారాగారశిక్ష విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు (స్పీడ్ ట్రయల్ కోర్టు) న్యాయమూర్తి డాక్టర్ ఎస్. రజిని బుధవారం తీర్పు ఇచ్చారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన 11 ఏళ్ల బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు పతకమూరి కాంతారావు (20) 2018, జూన్ 30వ తేదీన లైంగికదాడి చేశాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు చేసి.. వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేశారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవి నారాయణ రెడ్డి బాధితుడి తరఫున వాదించి 11 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో పతకమూరి కాంతారావుకు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితుడికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ రాగానే హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు : తేల్చిచెప్పిన నారా లోకేష్
ఇదిలా ఉండగా, జూలై 20న విశాఖపట్నంలో ఇలాంటి కేసులోనే ఓ వ్యక్తికి ఇదే శిక్ష విధించింది కోర్టు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కుమార్తె మీద పలుసార్లు అత్యాచారం జరిపాడు. ఈ నేరం రుజువు కావడంతో తండ్రికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. ఈమేరకు పోక్సో చట్టం కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె. రామశ్రీనివాసరావు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, కిటుముల పంచాయితీ, బౌడ గ్రామానికి చెందిన బాలిక (14) సమీపంలోని ఓ స్కూల్లో 8 వ తరగతి చదువుతుంది. అక్కడి హాస్టల్ లోనే ఉండేది. ఆమె తండ్రి కూలీ పనులు చేసేవాడు. నిత్యం భార్య, కూతురిని అనుమానిస్తూ తిడుతుండేవాడు. స్కూల్లో చదువుతున్న కుమార్తెను ప్రతివారం ఇంటికి తీసుకువచ్చి బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.. దీంతో బాలిక భయపడి మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో 2019 సెప్టెంబర్ 3న హాస్టల్ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు.
కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లడంతో, ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బయటికి వెళ్ళిన భార్య ఏదో పనిమీద వెంటనే వెనక్కి రావడంతో జరుగుతున్నఘోరాన్ని చూసింది. షాక్ కు గురయింది. భర్తతో గొడవ పెట్టుకుంది. కుమార్తెను తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.