గుంటూరు: యువతిని హత్య చేసిన ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. తాను ప్రేమిస్తున్నానంటూ యువకుడు యువతి వెంటపడ్డాడు. 2009లో యువతి పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో అది జరిగింది.

యువతి పాత గుంటూరుకు చెందింది కాగా, యువకుడు అలీనగర్ కు చెందిన షేక్ కరీం అలియాస్ నాగూర్. యువతి చదువుతున్న కళాశాలలోనే అతను కూడా చదివాడు. ఆ తర్వాత గుంటూరులోని టీవీలర్ షోరూంలో యువతి పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో రఫీ అనే యువకుడితో ఆమె సన్నిహితంగా ఉందని అనుమానించాడు కరీం. దాంతో ఆమె చేత ఉద్యోగం మాన్పించాడు. 

2018 మే 25వ తేదీన కళాశాలలో తనతో పాటు చదివిన స్నేహితురాలి పెళ్లి ఉందని, ఆ పెళ్లికి వెళ్తున్నానని యువతితో ఆమె కుటుంబ సభ్యులకు కరీం చెప్పించాడు. అలా చెప్పించి ఆమె బయటకు వచ్చేలా చూశాడు. ఆమెను తాను పాత గుంటూరులో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లాడు. 

త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని యువతి పట్టుబట్టింది. అందుకు కరీం నిరాకరించాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువతి బెదిరించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కరీం ఆమె తలను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు.

గోడలను కోసే ఇనుప యంత్రంతో యువతి శరీరం, కాళ్లు, చేతులను ముక్కలుగా కోశాడు. చీకటి పడిన పతర్వాత మూట కట్టి టూవీలర్ మీద సుద్దపల్లిడొంక సమీపంలోని విజయశాంతి నగర్ లో గల నిర్మానుష్యమైన ప్రదేశంలో గల చెట్టుపొదల్లో పడేశాడు. రెండు రోజుల తర్వాత పెట్రోల్ పోసి మూటకు నిప్పు పెట్టాడు. 

హత్య చేసిన యువతి శరీరం నుంచి కారని రక్తం మరకలు, ఇతర ఆధారాలు లభించకుండా ప్రత్యేకమైన రసాయనాలతో చెరిపేశాడు. కాలిపోయిన శరీరం అస్తిపంజరం తలభాగంపై గాయం ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పలు ఆధారాలతో కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.