ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కించపరుస్తూ.. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారు. కాగా... వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముఖ్యమంత్రి జగన్‌పై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తితో పాటు ఆ పోస్టింగ్‌లను షేర్‌ చేసిన మరో వ్యక్తిని కూడా  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నాగేంద్ర కుమార్‌ తెలిపారు. 

ఆదివారం జగ్గయ్యపేట పోలీసులు పట్టణానికి చెందిన చల్లపల్లి అవినాష్‌, చిల్లకల్లుకు చెందిన ఏనిక గోపిలపై కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేయగా నిందితులకు కోర్టు రెండు వారాల పాటు రిమాండ్‌ విధించినట్టు ఎస్సై ధర్మరాజు తెలిపారు. ఫేస్‌బుక్‌లో ప్రముఖ వ్యక్తులపై అసభ్యకర పోస్టింగ్‌లు, షేర్‌లు చేసి అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దని సీఐ, ఎస్సైలు హెచ్చరించారు.