పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. అక్క పెళ్లి కోసం షాపింగ్ వెళ్లి ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

పలమనేరు మండలం కాలువపల్లె గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరి వివాహం ఈ నెల 13న జరుగనుంది. ఇళ్లంతా ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. దీంతో.. తన అక్క పెళ్లికి  వెంకటాద్రి(17) అనే యువకుడు కొత్త దుస్తులు కొనుక్కోవాలని అనుకున్నాడు. తన కుటుంబీకులు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పడంతో వెంకటాద్రి  తన బంధువు కర్ణాటకు చెందిన ప్రశాంత్‌ (23)తో కలసి బైక్‌పై షాపింగ్ కి వెళ్లారు.

షాపింగ్ పూర్తి చేసుకొని ఇద్దరూ బైక్ పై తిరిగి వస్తుండగా..  ఎదురుగా వెళ్లిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటాద్రి తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రశాంత్‌(23) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.