ఇంటర్ లో ప్రేమించాడు... చాలా కాలం తర్వాత ఫేస్ బుక్ లో మళ్లీ కనెక్ట్ అయ్యారు. అది కాస్త ఇద్దరూ కలిసి ఒకే గదిలో సహజీవనం చేసేదాకా వెళ్లింది. చివరకు చిన్న చిన్న మనస్పర్థలకే ప్రాణాలు తీసేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జీవీఎంసీ పరిధి 40వ వార్డులోని హుస్సేన్ నగర్ కు చెందిన విరీత్ రోహిత్(22) పంజాబ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గతంలో నగరంలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి దూరమైంది. తాజాగా... అతనికి మళ్లీ ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో తారసపడింది. అంతే వెంటనే మెసేజ్ చేశాడు.

ఆ మాటలు కాల్స్ కి దారి తీశాయి. అప్పుడెప్పుడో ఆగిపోయిన ప్రేమకు మళ్లీ చిగుళ్లు వేశాయి. దీంతో.. ఇద్దరూ మరోసారి తమ ప్రేమకు ప్రాణం పోశారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం కాస్తా ఇరువైపులా తల్లిదండ్రులకు తెలిసిపోయింది.

దీంతో ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి అని పేరెంట్స్ తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరూ అదే ప్రయత్నంలో పడ్డారు. అయితే... లాగూ పెళ్లి చేసుకుంటామని భావించిన వీరిద్దరూ మురళీనగర్‌ ఎన్జీజీవోఎస్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు.

Also Read తల్లీకూతుళ్ల హత్య: హంతకుడికి ఉరిశిక్ష, నెల్లూరు కోర్టు సంచలన తీర్పు.
 
యువతి నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా రోహిత్‌ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం యువతి విధులకు వెళ్లిపోగా, మధ్యాహ్నం రోహిత్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీర బిగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

స్థానికులు అందించిన సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కంచరపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ బి.లోకేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.