తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి.. మరొకరిని పెళ్లి చేసుకుందని బాధపడ్డాడు. ఆమె లేకుండా తనను తాను ఊహించుకోలేకపోయాడు. ప్రియురాలిని మర్చిపోదామని తాను వేరే వివాహం చేసుకున్నాడు. అయినా మర్చిపోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఊటగడ్డ ప్రాంతానికి చెందిన బొజ్జా సాయికుమార్‌ (28) జిల్లా పరిషత్‌ జంక్షన్లో ఉన్న ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. 

ఈ నేపథ్యంలో ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరగగా, సాయికుమార్‌కు మూడు నెలల కిందట శ్రావణితో పెళ్లి అయింది. అయితే సాయికుమార్‌ మాత్రం ముందు నుంచి ప్రేమించిన ఆ అమ్మాయిని మరిచిపోలేకపోయేవాడు. భార్య శ్రావణి ఎదురుగానే ప్రియురాలికి సెల్‌ఫోన్‌ సాయంతో మెసెజ్‌లు పెట్టడం, మాట్లాడడం చేసేవాడు.

 ఈ క్రమంలో భార్య శ్రావణి నగరంలోనే ఉన్న పుట్టింటికి వెళ్లగా ఒంటరిగానే ఇంట్లో ఉన్నాడు. ప్రియురాలితో  మాట్లాడిన అనంతరం సాయికుమార్‌ సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భార్య శ్రావణికి ఫోన్‌ చేసి చెప్పాడు. కంగారు పడిన ఆమె ఫోన్‌ చేసినప్పటికీ సాయికుమార్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఇంటికి చేరుకొని చూసేసరికి భర్త ఉరి వేసుకొని ఉన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.