తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని.. లేదంటే ఆత్మహత్య చేస్తానంటూ ఓ యువకుడు నానా హంగామా సృష్టించాడు. సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దాదాపు రెండు గంటలపాటు టవర్ ఎక్కి... కిందకు దిగనంటే దిగనని మెరాయించాడు. చివరకు ఎమ్మెల్యే వచ్చి హామీ ఇవ్వడంతో టవర్ దిగి కిందకు వచ్చాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వళ్లియప్పనగర్ లో చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. వళ్లియప్పనగర్ కి చెందిన సంపత్ కుమార్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తవణం పల్లె మండలానికి చెందిన ఓ యువతిని సంపత్ ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు కూడా సంపత్ అంటే ఇష్టమే. కాగా... ఇటీవల ఈ విషయం యువతి ఇంట్లో తెలిసిపోయింది. వేరు వేరు కులాలు కావడంతో వారి పెళ్లికి యువతి ఇంట్లో వారు నిరాకరించారు.

దీంతో మనస్తాపానికి గురైన సంపత్ సోమవారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కిందకు దిగి రావాలని ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది.  తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తానని హామీ ఇస్తేనే తాను కిందకు దిగుతానని తేల్చిచెప్పాడు. యువకుడి తల్లి అక్కడికి వచ్చి బ్రతిమిలాడినా కూడా  అతను కిందకు దిగలేదు. దీంతో ఆమె అక్కడ స్పృహ తప్పి పడిపోయింది.

పరిస్థితి విషమించడంతో... అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. వెంటనే ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాం హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగి వచ్చాడు. కాగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.