వారిద్దరూ మంచి స్నేహితులు.. భోజనం చేయడానికి బయటకు వెళ్లారు. ఆ తర్వాత కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవాలని అనుకున్నారు. కానీ మధ్యలో అనవసరంగా గొడవ మొదలైంది. దానికి తోడు  ఇద్దరూ గంజాయి సేవించి ఉన్నారు. ఆ మత్తులో  ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలీకుండా ప్రవర్తించారు. ఫలితంగా.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రామవరప్పాడులోని హనుమాన్ నగర్ కు చెందిన సురేంద్ర(21), మరో బాలుడు (16) స్నేహితులు. బాలుడు స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తుండగా..  సురేంద్ర ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం  ఇద్దరూ సాయంత్రం భోజనం చేయడానికి బయటకు వెళ్లారు. అనంతరంత ఓ ఖాళీ స్థలంలో కూర్చొని గంజాయి తాగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. 

ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీనిలో భాగంగానే సదరు మైనర్ బాలుడు.. సురేంద్రపై కత్తితో దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన సురేంద్ర.. ఓ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.