ఓ యువకుడి ప్రేమ అతని తండ్రి చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. తమ చెల్లెలిని నీ కొడుకు ప్రేమిస్తాడంటూ ఓ వ్యక్తి సదరు యువకుడి తండ్రి పై దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా హిందూపురంలోని మోడల్ కాలనీలో చాంద్ బాషా అనే వ్యక్తి కుటుంబంతో పాటు కలిసి జీవిస్తున్నాడు. కాగా.. చాంద్ బాషా కొడుకు సైపుల్లా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇలోపే.. వీరి ప్రేమ విషయం సదరు యువతి అన్నకు తెలిసిపోయింది. అంతే నానా రణరంగం సృష్టించాడు.

మంగళవారం ఉదయం సదరు యువతి అన్న అజకర్, అతని స్నేహితుడితో కలిసి చాంద్‌ బాషా ఇంటిపైకొచ్చి ఘర్షణకు దిగాడు. తన చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నీ కొడుకు సైపుల్లాను అంతం చేస్తానని కత్తి చేతబట్టి బెదిరింపులకు దిగాడు. అయితే, ఒకరికొకరు ఇష్టపడుతున్నన్న యువతీయువకులకు పెళ్లి చేద్దామని చాంద్‌ బాషా నచ్చజెప్నే యత్నం చేయడంతో అజకర్‌ కోపంతో రగలిపోయాడు. 

అదే సమయంలో ఇంట్లో సైపుల్లా కూడా లేకపోవడంతో చాంద్‌ బాషాపై‌, తన స్నేహితుడితో కలిసి అజకర్‌ కత్తితో దాడికి దిగాడు. చాంద్‌ బాషా చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.