తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని.. కొద్ది దూరం లిఫ్ట్ ఇవ్వాలని కోరారు. దీంతో.. గురవయ్య పేరూరు నుంచి తొండవాడ వద్దకు రాగానే వారిని దిగాలని కోరాడు.


రాత్రి సమయంలో.. రోడ్డుపై నిలబడి లిఫ్ట్ కావాలంటూ అడిగారు. పాపం.. అసవరంలో ఉన్నారు కదా అని సహాయం చేద్దామని అతను ముందుకు వచ్చాడు. కానీ.. సహాయం చేసిన వ్యక్తిపైనే దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని తొండవాడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లయ్యపల్లెకి చెందిన గురవయ్య తిరుపతి శివారులోని ఓ గోడెన్ లో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి తన పని ముగించుకొని ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు యువకులు వచ్చి గురయ్యను లిఫ్ట్ అడిగారు.

తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని.. కొద్ది దూరం లిఫ్ట్ ఇవ్వాలని కోరారు. దీంతో.. గురవయ్య పేరూరు నుంచి తొండవాడ వద్దకు రాగానే వారిని దిగాలని కోరాడు. అనంతరం అక్కడ నుంచి చంద్రగిరికి వెళ్తున్న క్రమంలో మరో యువకుడితో కలసి వారు గురవయ్యను వెంబడించారు. ఇనుప రాడ్డుతో ఆయనపై దాడికి యత్నించారు. 

ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి గురవయ్య కింద పడిపోయాడు. అనంతరం రాడ్డుతో తలపై మోది, గురవయ్య వద్ద ఉన్న రూ.5వేల నగదు, ఏటీఎంలను దోచుకుని పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న గురవయ్యను స్థానికులు గుర్తించి, 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గురవయ్యను తిరుపతి రుయాకు తరలించారు. అనంతరం ఆదివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.