విజయవాడ: బైక్‌కు సైడ్ ఇవ్వలేదనే నెపంతో నార్కట్ పల్లి  డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయవాడలోని భవానీపురం వద్ద చోటు చేసుకొంది.

శనివారం అర్ధరాత్రి విజయవాడ నుండి హైద్రాబాద్‌కు వస్తున్న బస్సుపై అల్లరిమూకలు దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని భవానీపురం వద్ద రోడ్డుపైనే బస్సును నిలిపివేసి దాడికి పాల్పడ్డారు.

తమ బైక్‌కు సైడ్ ఇవ్వలేదని ఆరోపిస్తూ నిందితులు ఆర్టీసీ బస్సును వెంబడించి నార్కట్‌పల్లి బస్సు డిపో‌కు చెందిన డ్రైవర్‌ను చితకబాదారు. బస్సులోని ప్రయాణీకులు  వారించినా కూడ అల్లరిమూకలు మాత్రం వినలేదు.  

ఇదిలా ఉంటే తమ బైక్‌కు సైడ్ ఇవ్వకుండా బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లే తాము కింద పడి తీవ్రంగా గాయపడినట్టుగా నిందితులు ఆరోపిస్తున్నారు.కానీ, బస్సు డ్రైవర్  వాదన మరోలా ఉంది. బస్సుకు సైడ్ ఇవ్వకుండానే వెంబడించి దాడికి పాల్పడినట్టుగా బస్సు డ్రైవర్‌ ఆరోపిస్తున్నారు.

రెండు బైక్‌లపై వెళ్తున్న అల్లరి మూకలు.... ఇంకా కొంత మంది స్నేహితులను పిలిపించి మరీ ఈ దాడికి పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు  నిందితులను గుర్తించారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

బస్సులో నుండి 25 వేలను కూడ దోచుకొన్నారని కూడ చెబుతున్నారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. 25 వేల నగదు దోచుకొన్న ఘటనపై ఫిర్యాదు చేస్తే ఆ విషయమై కూడ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.