అమ్మాయితో మాట్లాడుతున్నాడని పోలీస్ స్టేషన్ కు పిలిచి చితకబాదడం యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యిందంటూ తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకువెళ్లారు టిడిపి నేత వర్ల రామయ్య.
తూ.గో జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల (ap police) తీరుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్ర విమర్శలు చేస్తోంది. అధికార వైసిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలో ఓ యువకుడి మృతికి కూడా పోలీసులే కారణమంటూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (varla ramaiah) ఆరోపించారు. యువకుడిని స్థానిక సీఐ చింత్రహింసలకు గురిచేయడంతో మరణించాడు... కాబట్టి సదరు పోలీస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య లేఖ రాసారు.
''ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొంతమంది గత రెండున్నరేళ్ల నుంచి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. 2022 మార్చి 6న మండపేట టౌన్ (mandapet) సిఐ దుర్గా ప్రసాద్ కాళీ కృష్ణ భగవాన్ అనే యువకుడిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు'' అని తూ.గో జిల్లా యువకుడి ఆత్మహత్యను డిజిపి దృష్టికి తీసుకెళ్లారు వర్ల రామయ్య.
''మండపేట పట్టణానికి చెందిన కాళీ 20 సంవత్సరాల యువకుడు. తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ కుటుంబానికి అండగా వుండేవాడు. అలాంటిది అతడిపై ఓ మహిళ తన కూతురితో మాట్లాడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని గత ఆదివారం టౌన్ సీఐ దుర్గాప్రసాద్ కాళిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతి దారుణంగా వ్యవహరించాడు. విచారణ పేరుతో కాళీని దారుణంగా చిత్రహింసలకు గురి చేసి రాత్రి 8.30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి వదిలేశారు'' అని రామయ్య తెలిపారు.
''అయితే పోలీసుల దాడిలో కాళీ మర్మాంగానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స తర్వాత కూడా మర్మాంగానికి తగిలిన గాయాలు మానలేదు. ఈ క్రమంలోనే కాళీ కృష్ణ ఆత్మహత్య చేసుకోగా 8 మార్చి 2022 (మంగళవారం) మృతదేహం ఎడిడా రోడ్డులో బయటపడింది. మర్మాంగాలకు తగిలిన దెబ్బలతో నొప్పి భరించలేక కాళీ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు'' అని వర్ల పేర్కొన్నారు.
''సీఐ దుర్గాప్రసాద్ వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమని బాధితుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు చెబుతున్నారు. సీఐ అత్యంత అవినీతిపరుడని... ప్రస్తుత కేసులో సైతం లంచం తీసుకున్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. ఆత్మహత్యకు ప్రేరేపించడం, చిత్రహింసలకు గురి చేయడం, వ్యక్తిగత భాగాలకు తీవ్ర గాయాలు చేసినందుకు సిఐ దుర్గాప్రసాద్‌పై తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. మీరు తీసుకునే సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్టకు భంగం కలుగకుండా ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుంది'' అని తన లేఖ ద్వారా డిజిపిని కోరారు వర్ల రామయ్య.
