హైదరాబాద్: ప్రేమ పేరుతో అబ్బాయిలు అమ్మాయిలను వేధించడం మనకు తెలుసు. కానీ, గుంటూరు జిల్లాలో మాత్రం రివర్స్ జరిగింది. ఓ అమ్మాయి నిన్నే ప్రేమిస్తున్నా..... నువ్వే నాకు కావాలి... నిన్నే పెళ్లాడుతా అంటూ వేధింపులకు పాల్పడింది. ఈ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Also read:భార్యా పిల్లలను చంపి రోజంతా అక్కడే, ఆతర్వాతే టెక్కీ ప్రదీప్ సూసైడ్

గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్ లో ఓ యువతి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అతను అంగీకరించాడు.

దీంతో మూడు నెలలపాటు వీరిద్దరూ ఛాటింగ్ చేశారు. నెల రోజుల క్రితం ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే ఆ యువకుడు మాత్రం దీనికి అంగీకరించలేదు. మన మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని తేల్చి చెప్పాడు.

పెళ్లి ప్రస్తావనను ఆ యువకుడు కొట్టిపారేశాడు. దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆ యువకుడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు.

యువతి కుటుంబసభ్యులను కలిసి ఈ విషయాన్ని వివరించేందుకు యువకుడి తల్లి వెళ్లింది.యువతి తన కొడుకును చంపేస్తానని బెదిరించిన విషయాన్ని గుర్తు చేసింది. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకొన్నారు.

మీ అబ్బాయిని మా అమ్మాయి ఇష్టపడింది. మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరగాల్సిందేనని చెప్పారు. మీ అబ్బాయి మా అమ్మాయిని  పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని హెచ్చరించారు.

దీంతో ఆ యువకుడు భయపడ్డాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన యువకుడి తల్లి అతడిని ఆసుపత్రిలో చేర్పించింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

యువతి కుటుంబసభ్యుల నుండి బెదిరింపులు ఆగడం లేదు. ఈ విషయమై గుంటూరు ఎస్పీని ఆశ్రయించింది యువకుడి కుటుంబం. తనకు న్యాయం చేయాలని కోరింది. రక్షణ కల్పించి తన కొడుకును కాపాడాలని ఆమె కోరింది.