ప్రకాశం జిల్లాలో ఓ యువతిపై కొందరు పరువుదాడి చేశారు. యువతి అన్న తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. ఆమెను వివస్త్రను చేసి, హింసించారు.
ప్రకాశం : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ యువతిపై పరువు దాడి జరిగింది. మౌనిక అనే యువతిని ఈడ్చుకెళ్ళిన ఓ కుటుంబం ఆమెను వివస్త్రను చేసి, ట్రాక్టర్ కట్టేశారు. ఆమెను హింసించారు. మౌనిక అన్న సాయిరాం.. తమ కూతురిని లేపుకెళ్లి... తమ పరువు తీశాడు అంటూ దుర్భాషలాడారు. యువతి ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్లు, కర్రలు పెడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ప్రస్తుతం మౌనిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొట్లపాలెంలో నివసించే బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి కూతురు, అదే ఊర్లోని వేరే కులానికి చెందిన సాయిరాం అనే వ్యక్తిని ప్రేమించింది.
తిరుపతి జిల్లాలో దారుణం... రెండో భార్యను కొట్టి చంపిన భర్త..
తమ ప్రేమకు ఇంట్లో ఎలాగూ ఒప్పుకోరనుకున్నారో, ఏమో.. వీరిద్దరూ ఆరు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి తాము కులాంతర వివాహం చేసుకున్నందున రక్షణ కల్పించాలంటూ కోరారు. తమ కుటుంబంపై దాడి చేస్తారని తెలిపారు. ఆ తర్వాత ఊరు నుండి వెళ్ళిపోయారు.
అప్పటినుంచి ఆ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి మున్సిపల్ నీళ్లు పట్టుకుంటున్న సాయిరాం తల్లి, చెల్లెలు మౌనికపై బ్రహ్మారెడ్డి కుటుంబం దాడికి దిగింది. యువతి తల్లి కళ్లలో కారం కొట్టి.. యువతి మీద దాడి చేశారు. నడిరోడ్డులో యువతి బట్టలు విప్పేసి వివస్త్రను చేసారు.
అలాగే ఇంటిదాకా ఈడ్చుకు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను చంపడానికి ప్రయత్నించారు. బ్రహ్మారెడ్డి భార్య అది ఆపి.. ఆమెను అలాగే నగ్నంగా ట్రాక్టర్ కు కట్టేయాలని, హింసించాలని సూచించింది. దీంతో, అలాగే చేశారు. పరుషమైన పదజాలంతో.. హింసిస్తూ.. తీవ్రస్థాయిలో దూషిస్తూ భయాందోళనలు సృష్టించారు. యువతి అన్న సాయిరాం.. అగ్రకులానికి చెందిన తమ కూతురుని వివాహమాడి, తమ పరువు తీశాడు అంటూ, వారి అడ్రస్ చెప్పాలంటూ బెదిరించారు.
కూతురిని లాక్కెళ్ళిన విషయం తల్లి పోలీసులకు చెప్పడం… అంతకుముందే వారి మీద కేసు నమోదయి ఉండడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతిని విడిపించారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.
