పోలీసుల వేధింపులు తాళలేక రాజమండ్రికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు ఎత్తివేయాలంటే లక్ష ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు బనాయిస్తామని కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యువకుడి ఆత్మహత్య వ్యవహరం కలకలం రేపుతోంది. పోలీసులు వేధిస్తున్నారంటూ పిండు గొయ్య గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు పోలీసులే కారణమంటూ ఆత్మహత్యకకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకున్నాడు. శివ అనే కానిస్టేబుల్ గురించి మృతుడు వీడియోలో చెప్పాడు. తనకు లక్ష రూపాయలిస్తే కేసు మాఫీ చేస్తానని అన్నారని... లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతానని బెదిరించాడని చెప్పాడు. గతేడాది తెలంగాణ నుంచి రెండు మద్యం బాటిళ్లు తెస్తూ కృష్ణా జిల్లా చిల్లకల్లు చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు చిక్కాడు యువకుడు మజ్జీ. ఈ కేసులో భాగంగా కానిస్టేబుల్ లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.