ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. వేధించాడు.. తట్టుకోలేక చెప్పుతో కొట్టిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఓ యువకుడు తనకు పరిచయమున్న యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధింపులకు గురి చేశాడు. ఆ యువతి తండ్రికి ఈ విషయం చెప్పడంతో ఆయన చెప్పుతో కొట్టించాడు. దీంతో మనస్తాపంతో షేక్ పర్దిన్ వలి అనే 20యేళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పోలీసుల కథనం ప్రకారం కొరిటపాడు సమీపంలోని హనుమయ్యనగర్ కు చెందిన షేక్ పర్దిన్ వలి పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఎనిమిదో తరగతి చదువుకునే టైంలో అదే ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. వలి మధ్యలోనే చదువు ఆపేయగా, ఆమె డిగ్రీ పూర్తి చేసింది. ఈ మధ్య ఆమె జిమ్ కు వెళ్లేప్పుడు పర్దిన్ వలి వెంటపడుతూ వేదింపులకు గురిచేస్తున్నాడు. యువతి ఆ విషయాన్ని ఆమె తండ్రికి చెప్పింది.

ఆయన తన కూతురితో పర్దీన్ వలిని రోడ్డుపై చెప్పుతో కొట్టించి మళ్లీ వెంటపడొద్దని బెదిరించి అరండల్ పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పెయింటర్ ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘటనలో మనస్తాపానికి గురైన పర్దీన్ వలి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

దీంతో ఆగ్రహించిన బంధువులు యువకుడి మృతదేమాన్ని అరండల్ పేట ఠాణా వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, యువతితోపాటు తండ్రిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. సీఐ శ్రీనివాసరావు జోక్యం చేసుకుని యువతి, ఆమె తండ్రిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.