ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలు వైసిపి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తే.. టిడిపి, జనసేన అభిమానులకు మాత్రం నిరాశని మిగిల్చాయి. టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు సరిపెట్టుకుని ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందాడు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. 

పవన్ కల్యాణే ఓడిపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడతారని జనసేన అభిమానులు భావించారు. కాని వారి అసలు ఆవిరయ్యాయి. ఇదిలా ఉండగా భీమవరంకు చెందిన ఓ యువకుడు పవన్ ఓడిపోయాడనే బాధతో ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. 

మే 23న పవన్ ఓడిపోయాడని తెలిసి ఆ యువకుడు ఎవరితోనూ మాట్లాడలేదట. రాత్రాంతా దిగులుగానే కనిపించాడని, తెల్లవారేసరికి ఇంట్లో కనిపించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.