విజయనగరం: నిరుద్యోగులకు ఊతమిచ్చేలా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ వాల౦టీర్ ఉద్యోగం ఓ యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి తనను ఎంపిక చేయలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు తమ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం మలియాడకు చెందిన గేదెల సురేష్ అనే యువకుడు గ్రామవాలంటీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. 

అయితే సురేష్ గ్రామవాలంటీర్ ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయాడు. దాంతో మనస్థాపానికి గురైన సురేష్ నేరుగా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడుకొండల అప్పలనాయుడు ఇంటికి వెళ్లాడు. ఎమ్మెల్యే ఇంటి ముందు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితుడు సురేష్ చికిత్స పొందుతున్నారు.