నెల్లూరులో అర్థరాత్రి ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. నెలరోజుల్లో వివాహం కాబోతోంది.. ఇతన్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. నెల్లూరు కరెంట్‌ ఆఫీసు సెంటర్‌ కార్‌జోన్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. 

నెల్లూరు విక్రమ్‌నగర్‌ చాముండేశ్వరి అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ నంబర్‌–301లో మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శంకరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి భార్య సీతారావమ్మ చనిపోవడంతో ఆయన శంకరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు.  మొదటి బార్యకు ఇద్దరు కొడుకులు కాగా, రెండో భార్య శంకరమ్మకు కొడుకు రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి సంగంలోని ఫెడరల్‌ బ్యాంకులో లోన్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

రవీంద్రనాథ్‌రెడ్డికి గత నెలలో హరనాథపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. జనవరి 8వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 4వ తేదీన రవీంద్రనాథ్‌రెడ్డి విజయవాడలో ఆఫీసు మీటింగ్‌ ఉందని చెప్పి వెళ్లాడు. 6వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేసి కుటుంబసభ్యులకు తెలిపాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేసి నెల్లూరుకు సమీపంలో ఉన్నానని కొద్దిసేపట్లో బస్సు దిగుతానని చెప్పాడు. 

ఈ క్రమంలో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో రవీంద్రనాథ్‌రెడ్డి తన తండ్రికి ఫోన్‌ చేసి కరెంట్‌ ఆఫీసు సెంటర్‌ కారుజోన్‌ వద్ద ఉన్నానని, తనను ఎవరో కత్తులతో పొడిచారని మాట్లాడలేక ఉన్నానని చెప్పాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి తన మేనల్లుడు శ్యామ్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం భార్య, మేనల్లుడుతో కలిసి శ్రీనివాసులురెడ్డి అక్కడికి వెళ్లేసరికే వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టి.వి.సుబ్బారావు, ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలంలో ఉన్నారు. 

తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ మేరకు బాధిత తండ్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

కొద్దిసేపట్లో బస్సు దిగుతానని రవీంద్రనాథ్‌రెడ్డి తన తండ్రికి రాత్రి 11.30 గంటలకు ఫోన్‌ చేశాడు. 12.15 గంటలకు తనను ఎవరో పొడిచారని ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు ఆ 45 నిమిషాల్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. బస్సు దిగిన వ్యక్తి కరెంట్‌ ఆఫీసు సెంటర్‌ వద్ద ఎందుకు దిగాల్సి వచ్చింది?.. అతనిని హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

రవీంద్రనాథ్‌రెడ్డి కాల్‌ డీటైల్స్, హత్య జరిగిన సమయంలో సెల్‌ఫోన్‌ టవర్‌ డంప్‌లను పరిశీలిస్తున్నారు. కరెంట్‌ ఆఫీసు సెంటర్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రవీంద్రనాథ్‌రెడ్డి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. అసలు అక్కడ ఎందుకు ఉన్నాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద రవీంద్రనాథ్‌రెడ్డి హత్య మిస్టరీగా మారింది. అతనికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఇతరత్రా వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.