రౌడీషీటర్ అంత్యక్రియల్లో జరిగిన గొడవ ఓ యువ ఫుట్ బాల్ ఆటగాడి దారుణ హత్యకు దారితీసింది. కొందరు దుండగులు యువకుడిపై కత్తులతో దాడిచేసి అతి కిరాతకంగా చంపిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
విజయవాడ: యువ ఫుట్ బాల్ ప్లేయర్ దారుణ హత్య (football player murder)కు గురయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా (ntr district crime)లో చోటుచేసుకుంది. స్నేహితుల గదిలో వుండగా యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసిన అతి కిరాతకంగా హత్యచేసారు దుండగులు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ (vijayawada) సమీపంలోని జక్కంపూడికి చెందిన ఆకాష్(22) ఫుట్ బాల్ ఆటగాడు. విజయవాడ లయోలా కాలేజీలో చదువుతున్న అతడు గురునానక్ కాలనీలోకి ఉండవల్లి కన్‌స్ట్రక్షన్ వద్ద ఉన్న సర్వీసు అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి అద్దెకు వుంటున్నాడు.
అయితే మంగళవారం టోనీ అనే రౌడీషీటర్ మృతిచెందడంతో ఆకాష్ స్నేహితులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఆకాష్ కు కొందరితో గొడవ జరిగింది. అక్కడున్నవారు వీరిని సముదాయించడం అప్పటికి గొడవ సద్దుమణిగింది. అంత్యక్రియలు ముగియగానే ఆకాష్ తన గదికి వచ్చాడు.
కానీ అంత్యక్రియల్లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న దుండగులు ఆకాష్ వుంటున్న అపార్ట్ మెంట్ కు వచ్చారు. ఈ సమయంలో ఒంటరిగా వున్న అతడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసారు. దీంతో ఆకాష్ రక్తపుమడుగులో కుప్పకూలిన తర్వాత దుండగులు పరారయ్యారు. కొనఊపిరితో వున్న అతడిని దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే శరీరంపై 16 కత్తిపోట్లతో ఆకాష్ మృతిచెందాడు.
యువకుడి హత్యపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆకాష్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆకాష్ హత్యకు పాల్పడిన నిందితులు గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందినవారిగా గుర్తించారు. పరారీలో వున్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
రౌడీషీటర్ అనుమానాస్పద మృతి:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీలో నివాసముండే రౌడీషీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వాంబే కాలనీలోని హెచ్ బ్లాక్‌లోని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శంకర్ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే అతడి హత్యకు కారణమయ్యిందా లేక మరేదయిన కారణాలతో హత్య జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తెలియాల్సి వుంది. శంకర్ మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
రౌడీషీటర్ టోని మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో మంగళవారమే అతడి అంత్యక్రియలు జరిగాయి. ఇందులో పాల్గొన్న సమయంలోనే ఆకాష్ తో కొందరు గొడవపడి చివరకు అతడిని అతి కిరాతకంగా చంపారు.
