విశాఖలో ఓ యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన కె.రాజశేఖర్‌ (32) చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఉంటూ పీజీ చేయాలని రాజశేఖర్ అనుకున్నాడు.

అయితే ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో తండ్రి కూడా అనారోగ్యానికి గురవ్వడంతో రాజశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో తను పీజీ చేసే అవకాశం లేదని భావించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మధురవాడ గణేష్‌ నగర్‌లో ఉంటున్న స్నేహితుడు సుబ్బరాజు ఇంటికి వచ్చాడు.

స్నేహితుడు లేకపోవడంతో ఆయనకు ఫోన్‌ చేయగా.. తాను వచ్చే వరకు ఫ్లాట్‌లో ఉండమని చెప్పాడు. సుబ్బరాజు తన పని ముగించుకొని రాత్రి 11 గంటలకు వచ్చి ఫ్లాట్‌ తలుపు కొట్టగా ఎంతకీ రాజశేఖర్ తీయలేదు.

దీంతో అతనికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. రాజశేఖర్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.