తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ తర్వాత సంసారాన్ని ఎలా ఈదాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన తురంగి జగదీష్ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నాడు.

ఇంటర్ చదువుతున్న సమయంలో సీటీఆర్ఐకి చెందిన కోట దీప్తిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో వద్దని వారించారు. అయితే వారు పెద్దలను ఎదరించి వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత ధవళేశ్వరం కొత్తపేటలోని ఓ ఇంట్లో కాపురం పెట్టారు. జగదీష్ రెండు నెలల పాటు బట్టల షాపులో పనిచేసి మానేశాడు. తర్వాత తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి కాలం గడిపారు.

ఏదో ఒక పని చేయకపోతే జీవితం గడవదని భావించి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే వారిని ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. అప్పులు తీర్చలేక, కన్నవారికి ముఖం చూపించలేక, ఉద్యోగం దొరక్క వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఇంట్లో పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి యజమాని వీరిని విగత జీవులుగా గుర్తించి జగదీష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. సోదరుడిని చూసిన జగదీష్ సోదరుడు వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.

వద్దంటే పెళ్లి చేసుకున్నాడని, వారి ఇబ్బందులను చూసి తానే అప్పుడప్పుడు ఆర్ధికంగా సాయం చేసేవాడినని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.