ఏలూరు:పెళ్లి చేసుకొన్న మరునాడే  ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో  ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొన్న మరునాడే  ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్‌తో పోలవరం మండలం సరిపల్లికుంట గ్రామానికి చెందిన తెల్లం పోశమ్మకు కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరిచయం ఏర్పడింది. 2016-18 మధ్య ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో  పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు చెబుతున్నారు.

వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే పోశమ్మ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.  కూలీ పనులు చేసుకొనేవాడికి పెళ్లి చేసుకొనేందుకు పోశమ్మ కుటుంబసభ్యులు అంగీకరించలేదు. 

 దీంతో 2018 జనవరి మాసంలో ఈ ప్రేమ జంట ఇంటి నుండి పారిపోయారు. దీంతో పోశమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ప్రేమ జంట తిరిగి ఇంటికి వచ్చింది.అయితే  పోశమ్మ మైనర్ కావడంతో వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. పోశమ్మ మేజర్ అయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 9వ తేదీన పోశమ్మ మేజర్ అయింది.  వీరిద్దరూ ఇంటి నుండి ప్లాన్ చేసుకొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరూ కూడ ఇళ్ల నుండి వేర్వేరుగా బయటకు వచ్చారు.  

జంగారెడ్డి మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొన్నారు. అక్కడే చాలా సమయం గడిపారు. అక్కడే ఎవరికి తెలియకుండా రహస్య వివాహం చేసుకొన్నారు. తమ పెళ్లి ఫోటోలను తీసుకొన్నారు.  అనంతరం ఫోటోలను శేఖర్ తన ఫేస్‌బుక్‌‌లో పోస్టు చేశాడు.  ఈ ఫోటోలు ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారాయి.

గుర్వాయిగూడెం గ్రామంలోని ఒక లాడ్జీలో గది అద్దెకు తీసుకొని బస చేశారు. మరునాడు ఉదయం 8 గంటలు దాటినా కూడ గది నుండి  ఈ ప్రేమ జంట గది బయటకు రాలేదు. ఫోన్ చేసినా కూడ  గది తలుపులు తీయలేదు. లాడ్జీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అప్పటికే ప్రేమికులు శేఖర్, పోశమ్మలు ఒకే మంచంపై అపస్మారకస్థితిలో కన్పించారు. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వాళ్లు మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పారు.

తమ పెళ్లికి ఒప్పుకోనందుకు పురుగుమందు సేవించి మృతి చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.