తన భార్యను వేధించడమే కాదు... ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తిపై ఓ యువకుడు అత్యంత దారుణంగా బ్లేడ్ తో దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు: పెళ్లయిన అమ్మాయిని ప్రేమ పేరిట వేధించడమే కాదు అడ్డుగా వున్నాడని ఆమె భర్తను హతమార్చడానికి ప్రయత్నించాడో దుండగుడు. పట్టపగలే నడిరోడ్డుపై అమ్మాయి భర్తపై బ్లేడ్ తో దాడిచేసి ఒళ్లంతా గాయపర్చాడు. అయితే దుండగులు దాడినుండి తప్పించుకున్న బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వడ్లమూడి గ్రామానికి చెందిన రాజు తెనాలి బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జి లో పనిచేస్తుంటాడు. ఇతడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఇటీవల వీరి మధ్యలోకి ఆసిఫ్ అనే యువకుడు వచ్చాడు.
పెళ్లి కాకముందే నిన్ను నేను ప్రేమించాను... నీ భర్తను వదిలేసి రావాలంటూ ఆసిఫ్ ప్రతిరోజు రాజు భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. భార్యను వేధించడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు ఆసిఫ్ ను మందలించడానికి ప్రయత్నించాడు. తన భార్య వెంట ఎందుకు పడుతున్నావ్... మరో సారి ఆమె జోలికి వస్తే బావుండదని హెచ్చరించాడు.
read more కేసు వాపస్ తీసుకోలేదని మరదలి ఇంటికి నిప్పు పెట్టిన బావ.. !
అయితే రాజు వార్నింగ్ కు ఆసిఫ్ ఏమాత్రం బయపడకపోగా నీ భార్యను నేను ప్రేమిస్తున్నాను... నువ్వు అడ్డుతప్పుకో అంటూ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆసిఫ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజుని అతి దారుణంగా బ్లేడ్లతో ఒళ్లంతా కోసి గాయపరిచారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు ప్రస్తుతం తెనాలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
