పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త దారుణహత్య.. గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి..
పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.
పల్నాడు : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా జంగమేశ్వర గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. వైఎస్ఆర్సిపి కార్యకర్త కూనిరెడ్డి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. టిడిపి నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు. కూనిరెడ్డి కృష్ణారెడ్డి జంగమహేశ్వపురం వైఎస్ఆర్సిపీలో యాక్టివ్ గా పని చేస్తారు. ఆయన హత్యకు గురవడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపినట్టు సమాచారం. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.
మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్. కృష్ణారెడ్డిపై సుమారు ఐదుగురు ప్రత్యర్థులు ముసుగులు వేసుకుని, కళ్ళల్లో కారం చల్లి హత్య చేసినట్టుగా స్థానికులు తెలిపారు.ఈ హత్య రాజకీయ కోణమా ఇంకా ఇతరమైన కారణాల అనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురజాల మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన జంగమహేశ్వరం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.